సామాన్య ప్రశ్నలకు జవాబుల శ్రేణి

శాం షమూన్

ప్రశ్న:

మత్తయి వ్రాసిన సువార్తలో పరలోకమందును భూమిమీదను తనకు సర్వాధికారము ఇయ్యబడింది అని యేసు క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా వ్రాయబడింది (మత్తయి 28:18 చూడండి), అనగా వేరెవరో ఆయనకు ఆ అధికారము ఇచ్చారు అని అర్థమొస్తోంది. యేసు క్రీస్తు ప్రభువుకంటే ఆ అధికారమును ఆయనకు ఇచ్చిన వారు గొప్పవారు అయి ఉండాలి, అనగా యేసు క్రీస్తు ప్రభువు సర్వాధికారము గలిగిన దేవుడు కాలేరు కదా! మెట్టుకు, దేవునికి సర్వాధికారము ముందునుంచే ఉంటుంది కదా, అలాంటప్పుడు అది ఆయనకు ఇవ్వబడాల్సిన అవసరం ఏమిటి?

జవాబు:
ఇక్కడ ఉన్న సమస్య అంతా ఏమంటే దేవుడు ఒకే ఒక వ్యక్తి అని ఈ ప్రశ్న వేస్తున్న ఆక్షేపకుడు ముందుగానే ఊహించుకొంటున్నాడు. కాని అలా ఎవరైనా ఊహించుటకు ముందు దానిని రుజువు చేయాలి. దేవుని ఆత్మావేశము వలన ప్రేరేపింపబడిన పరిశుద్ధ గ్రంథ పుటలలో దేవుడు ఒకే వ్యక్తిగా బయలుపరచుకొన్నట్లు ఆక్షేపకుడు చూపించి, అదే సమయములో తండ్రి, కుమారుడు (యేసు క్రీస్తు ప్రభువు) మరియు పరిశుద్ధాత్ముడు వేర్వేరు వ్యక్తులై ఉంటూనే ముగ్గురూ కలిసి ఒకే దేవునిగా ఉంటున్నారని పరిశుద్ధ గ్రంథము చెబుతున్న వాక్యభాగములను కూడా సరిగా వివరించాలి.

సమస్తమును దేవునివే మరియు ఆయనే తన సృష్టికి కావలసిన సమస్తమును అనుగ్రహించువాడు; కనుకనే దేవుడు కాకుండా ఉన్నమిగతా వారెవరూ దేవునికి ఏమియు ఇవ్వలేరు అనునది సత్యము:

"నా జనులారా, నేను మాటలాడబోవుచున్నాను ఆలకించుడి; ఇశ్రాయేలూ, ఆలకింపుము నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికెదను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహనబలులు నిత్యము నాయెదుట కనబడుచున్నవి. నీ యింట నుండి కోడెనైనను నీ మందలోనుండి పొట్టేళ్లనైనను నేను తీసికొనను. అడవి మృగములన్నియు వేయికొండల మీది పశువులన్నియు నావేగదా. కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా?" (కీర్తనలు 50:7-13)

"జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతిజాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోయని, తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలె - మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు." (అపొస్తలుల కార్యములు 17:24-29)

"ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్‌." (రోమీయులకు 11:33-36)

కాని ఇవి ఎక్కడా కూడ దేవుని వ్యక్తిగత అంతరంగ జీవనము మరియు అంతర్‌సహవాసమును గురించి లేశమాత్రమైన చెప్పడము లేదు. ఐతే, దేవుడు త్రియేక దేవునిగా (ఒకే దేవునిగా ఉనికి కలిగిన ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా) ఉన్నాడని ఒక్క క్షణం ఊహించుదాం. అప్పుడు దైవ వ్యక్తులలోని ఒకరు మరొకరికి అధికారమును అనుగ్రహించుచున్నారు అనుటకు, లేదా దైవత్వములోని  ఒక వ్యక్తి మరొక వ్యక్తికి (లేక మిగిలిన వారికి) లోబడియుండుటను బట్టి యేసుక్రీస్తు ప్రభువు త్రిత్వములోని ఇంకొకరి దగ్గరనుండి ఏదో ఒకదానిని పొందుకున్నారు అని తెలిజేస్తున్న వాక్యభాగముల వలన త్రిత్వోపాసకులకు ఎటువంటి సమస్యా ఉండదు. మెట్టుకు, యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడుగా తండ్రికి లోబడుచున్న కారణాన్ని బట్టియే ఆయన దేవుని కుమారునిగా పిలువబడ్డారు. అయినను, భూసంబంధమైన తండ్రులు తమ కుమారులకంటే అధికారములో పెద్దవాళ్లయిన రీతిగనే  తండ్రియైన దేవుడు దైవకుమారునికి అధికారమును అనుగ్రహించుచున్నాడు. అలాగని తమ కుమారులు తండ్రులకంటే తక్కువవారని మాత్రము అర్థము కాదు. మరియు దైవకుమారుడు దేవుడు కాదనో లేక తక్కువ దేవుడనో అర్థం కానే కాదు.

అధికారములో గొప్పవాడుగా ఉండటమంటే ఆ వ్యక్తి తత్వములో కూడా మరొకరికంటే గొప్పవాడని అర్థం కాదు. అలాగే మరొకరికి లోబడియున్న వ్యక్తి స్వభావములో కూడా వారికంటే తక్కువవాడని అనుకోనవసరములేదు. అలా భావించటం 'వర్గీకరణ తప్పిదము' చేయటమే; అనగా స్వభావము మరియు అధికారము అనే రెండు వేర్వేరు వర్గములను కలిపేసి ఆ రెండిటి మధ్య తేడా లేనట్టుగా చూపడమే వర్గీకరణ తప్పిదము.

దిగువనీయబడిన వృత్తాంతము దీనిని అర్థము చేసుకొనుటకు సహాయము చేస్తుంది:

"అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద లోపరచియుంచెను.  సమస్తమును  లోపరచబడియున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడియున్నదను సంగతి విశదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును." (1కొరింథీయులకు 15:24-28)

వారిలో(దైవత్వములోని ముగ్గురు వ్యక్తులలో) ఒకరు దేవుడు కాదు అనే భావన తలెత్తకుండానే,  దైవత్వములోని  ఒక వ్యక్తి మరొకరికి ఎలా అధికారమును అనుగ్రహిస్తారో తెలియజేసే శ్రేష్ఠమైన ఉదాహరణ ఇక్కడ ఇవ్వబడింది. గమనించండి, తండ్రి అన్నిటిని కుమారునికి లోబరచినాడు, మరియు కుమారుడు తండ్రికి రాజ్యమును అప్పగిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు సమస్తమైన ఆధిపత్యమును మరియు అధికారమును బలమును కొట్టివేసి వాటిని తండ్రి యొక్క పూర్తి ఆధీనములోనికి తీసుకొస్తున్నాడు. పై వాక్యభాగములో యేసుక్రీస్తు ప్రభువు యొక్క సర్వాధికారము మరియు సర్వాధిపత్యము స్పష్టముగా కనిపిస్తుంది. ఆ విధముగా, తండ్రి కుమారుని యొద్ద నుండి రాజ్యమును పొందుకొనటము వలన తండ్రి దేవుడు కాదని ఎలా రుజువు కాలేదో అలాగే కుమారుడు ప్రభుత్వము చేయనధికారమును తండ్రి యొద్ద నుండి పొందుకున్నాడు అనునది కూడా ఆయన దేవుడు కాదని ఎంతమాత్రమును రుజువుపరచలేదు. మరియు గుర్తుంచుకొనవలసిన మరొక విషయమేమనగా, లేఖనముల ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు స్వచ్ఛందముగా, అనగా తన ఇష్టప్రకారముగనే పరలోకమునుండి దిగివచ్చి దాసుని పాత్రను ధరించారు. ఆయన భూమి మీదనుండగా ప్రభువైన యేసుక్రీస్తు తన స్వీయప్రస్తావనతో ఏమియు చేయక, కేవలము తండ్రి ఆజ్ఞాపించి ఆశించిన దానిని మాత్రమే చేయుచు, తండ్రి యొక్క అధికారమునకు తనకు తానుగా అప్పగించుకున్నారు:

"తక్కిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ యిద్దరు సహోదరులమీద కోపపడిరి గనుక యేసు తనయొద్దకు వారిని పిలిచి - అన్య జనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును. మీలో ఆలాగుండకూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను; మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను. ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను." (మత్తయి సువార్త 20:24-28)

"నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని." (యోహాను సువార్త 6:38)

"క్రీస్తు యేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను." (ఫిలిప్పీయులకు 2:5-8)

యేసు క్రీస్తు ప్రభువు తన్ను తాను స్వచ్ఛందముగా తగ్గించుకొని దాసుని స్వరూపము ధరించుకొనినందుకుగాను తండ్రి ఆయనను తిరిగి హెచ్చించాడు.

"అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను." (ఫిలిప్పీయులకు 2:9-11)

కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు కొంత కాలము వరకు తన్ను తాను తండ్రికంటే తగ్గించుకున్నారు, అందువలన తండ్రి ఆయనను హెచ్చించవలసి వచ్చినది. పైన మనము చదివిన వచనముల వెలుగులో మత్తయి 28:18లో మనము ప్రస్తావిస్తున్న విషయము స్పష్టముగా అర్థమగుచున్నది. ఇంకొక మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభువు తాను చేయుటకు పంపబడిన పనిని ముగించిన తరువాత తనంతట తాను హెచ్చించుకొనలేదు కాని తన తండ్రిచేత హెచ్చింపబడుటకు విధేయతతో వేచియుంటిరి. మెట్టుకు, యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులు ఎలా ఉండాలని వారికి బోధించారో దానిని ఆయన పూర్ణముగా ఆచరించారు:

"మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను. తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును." (మత్తయి సువార్త 23:11-12)

ఇదంతయు ఇలా నుండగా, ఇప్పుడు మనము మత్తయి సువార్త 28:18 వచనము నొద్దకు తిరుగి వద్దాం. యేసుక్రీస్తు ప్రభువుని గురించి క్రైస్తవులు కలిగి ఉన్న ప్రామాణిక భావమును ఆ వచనపు పూర్వోత్తర సంధర్భములు బలపరుస్తున్నవో లేవో కూడా పరీక్షించుదాం.

"వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని, కొందరు సందేహించిరి. అయితే యేసు వారియొద్దకు వచ్చి - పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను." (మత్తయి సువార్త 28:17-20)

బైబిలు యొక్క విశాల దృక్పథములో ఒక వ్యక్తి పేరు ఆ వ్యక్తి యొక్క స్వభావమును, తత్వమును మరియు/లేదా లక్షణములను సదా సూచిస్తుంది:

"కాగా యెహోవా - నీవు చెప్పిన మాటచొప్పున చేసెదను; నీమీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరునుబట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు - దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన - నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను, ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెదననెను. మరియు ఆయన - నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను. మరియు యెహోవా - ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్లుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్లువరకు నా చేతితో నిన్ను కప్పెదను; నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను." (నిర్గమకాండము 33:17-23)

"మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు - యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను." (నిర్గమకాండము 34:5-7)

దేవుని మహిమను చూడాలని మోషే అడుగగా, దేవుడు తన సేవకునికి తన నామమును ప్రకటించెదనని చెప్పెను. దేవుడు తన నామమును ప్రకటిస్తూ తన గుణములను మరియు లక్షణములను కొన్నిటిని వివరించాడు. మరియు దేవుడు మోషేను పేరును బట్టి ఎరుగుదునని చెప్పెను, అనగా దేవుడు మోషేను వ్యక్తిగతముగా ఎరుగును అని దాని అర్థము. మరొక మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తి పేరు తెలుసుకోవటము అంటే ఆ వ్యక్తినే తెలుసుకోవటమన్నమాట. పేరు అనేది వ్యక్తి/వ్యక్తిత్వమునకు లేక గుణలక్షణములకు సమానార్థ పదముగా నున్నది:

"మంటి బలిపీఠమును నాకొరకు చేసి, దానిమీద నీ దహన బలులను సమాధానబలులను నీ గొఱ్ఱలను నీ యెద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగానుంచు ప్రతి స్థలములోను నీయొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను." (నిర్గమకాండము 20:24)

దేవుని నామమును జ్ఞాపకము చేసికొనుట దేవుని జ్ఞాపకము చేసుకొనుటయే.

"నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చిఉల్లసింతురు." (కీర్తనలు 5:11-12)

"యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను." (కీర్తనలు 7:17)

ఎవరైనా దేవుని నామమును ప్రేమించి కీర్తిస్తే, మరొకవిధానములో అతడు దేవుని ప్రేమించి కీర్తించినట్లే.

"భూమ్యాకాశములను  సృజించిన  యెహోవా నామమువలననే మనకు సహాయము కలుగుచున్నది." (కీర్తనలు 124:8)

సరిపోల్చి చూడండి:

"యెహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు." (కీర్తనలు 121:2)

దేవుని పేరు అనేది దేవుని సన్నిధి, శక్తి, ఉనికి మొదలగు వాటికి పర్యాయపదముగా వాడబడినది. కావున, ఈ రెండు వచనభాగములలో దేవుని యొద్దనుండి మరియు ఆయన నామమువలన సహాయము కలుగునని చెప్పుట గమనించదగిన విషయము.

పేరు అనేది ఒక వ్యక్తి పొందుకున్న యొక్క స్వభావిక లేదా సంక్రమిత అధికారములను కూడా సూచిస్తుంది:

"దావీదు - నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను." (1 సమూయేలు 17:45)

"నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు,  మరియొకడు తన నామమున వచ్చినయెడల వానిని అంగీకరింతురు." (యోహానుసువార్త 5:43)

ఎంతో పేరుగాంచిన గ్రీకు వ్యాకరణవేత్త మరియు క్రొత్త నిబంధనయందు విద్వాంసుడు అయిన, కీర్తిశేషులు ఎ.టి. రాబర్ట్‌సన్‌, మత్తయిసువార్త 28:19 మీద వ్యాఖ్యానిస్తూ ఇలా వ్రాశారు:

... ఈ వచనములో వాడబడిన “ఒనొమ” (నామము) అనే గ్రీకు పదము, (గ్రీకు) సెప్టుఅజింట్ట్‌మరియు (గ్రీకు) పపైరిలలో సాధారణముగా ఒక వ్యక్తి యొక్క శక్తి మరియు అధికారములను సూచించుట కొరకు ఉపయోగించబడుతుంది... (Robertson' Word Pictures of the New Testament ఇక్కడ చదువగలరు)

ఈ ఆధారములను బట్టి, యేసు క్రీస్తు ప్రభువు తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము (నామములు కాదు) లోనికి అని చెప్పుట ముగ్గురు వ్యక్తులు ఒకే స్వభావము, తత్వము, లక్షణములు మరియు/లేక అధికారము కలిగియున్నారని సాధారణముగా తెలియచేస్తుంది. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు ఒకే స్వభావము కలిగి, తమ దైవాధికారములో సమానముగా ఉంటూ, ఒకే నిత్యత్వపు ఉనికిని కలిగియున్నారు కాబట్టి వారు ఒకే నామము కలిగియున్నారు. అదే సమయములో వారు వ్యక్తిత్వములో వేరువేరై యున్నారు. యేసు క్రీస్తు ప్రభువు “నామము”ను గురించి ఈ అవగాహన తనవారికి ఇచ్చి, ఆ వెనువెంటనే “సదాకాలము” తనవారితో ఉంటానని ఆయన చేసిన ప్రమాణము కూడా ఆ సంధర్భమునకు సరిగ్గా సరిపోతుంది. ఎలాగనగా - అందరితో సదాకాలము  ఉండటము అనేది  సర్వవ్యాపియైన దేవునికి మాత్రమే సరిపోయే దైవలక్షణము. మత్తయి సువార్తలో మరొక చోట కూడా యేసుక్రీస్తు ప్రభువు తన సర్వవ్యాపకత్వమును దృఢపరుస్తున్నారు:

"ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను." (మత్తయి సువార్త 18:20)

ఇప్పటివరకు చెప్పుకున్నదానిని టూకీగా చూస్తే మనం ఈ క్రింది విషయాలను తెలుసుకుంటాం:

  • యేసుక్రీస్తు ప్రభువు ఆరాధింపబడినారు.
  • యేసుక్రీస్తు ప్రభువునకు అన్నింటా సర్వాధికారము ఉన్నది.
  • తండ్రి మరియు పరిశుద్ధాత్ముడు కలిగియున్న ఒకే దైవనామము, అధికారము, తత్వము, స్వభావము, గుణలక్షణములు మొదలగునవి యేసుక్రీస్తు ప్రభువు కూడ కలిగియున్నట్లు తెలియచేశారు.
  • యేసుక్రీస్తు ప్రభువు సర్వవ్యాపి; తన సర్వశక్తి/సర్వాధికారముతో కూడిన సన్నిధి తన విశ్వాసులందరితో యుగసమాప్తి వరకు సదా తోడుగా ఉంటుందని ఆయన వాగ్దానము చేశారు.

యేసుక్రీస్తు ప్రభువు పలికిన కొన్ని మాటలలో తన దైవత్వమును తృణీకరిస్తునట్లుగా ఆయనను అపార్థము చేసుకోరాదని ఈ విషయాలు మనకు స్పష్టము చేస్తున్నాయి. దేవుని చిత్తమును నెరవేర్చుటకు యేసుక్రీస్తు ప్రభువు తన్ను తాను తగ్గించుకొని తన దైవాధిక్యతలను కొంతకాలము వరకు ప్రక్కనబెట్టిన తరువాత, యెవనికైతే తన్నుతాను లోబరచుకున్నారో అయన యొద్దనుండి తనదైయున్న ఆ అధికారమును తనకున్న దైవహక్కునుబట్టి తిరిగిపొందుకొన్నారు అనునది ఆయన పలికిన మాటలలోని సామాన్యపు అర్థము.
మరియు, యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడైనంత మాత్రముగా కాక ఆయన మానవునిగానున్నప్పుడు సహితము తండ్రి చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చియున్నారు కాబట్టి, మానవ స్వరూపిగానే దేవుని సర్వాధికార పాలనలో పాలుపొందుటకు హక్కును సంపాదించుకున్నారు. ఆ విధముగా చేస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు తనయందు విశ్వాసముంచినవారు కూడ ఈ పాలనలో పాలొందుటకు హక్కును అనుగ్రహించియున్నారు. ప్రాముఖ్యముగా దీని అర్థమేమంటే ఆదాము పతనానికి ముందు మానవాళికుండిన ఆ గొప్పతనమును మరియు కంటికి దృశ్యమైన సృష్టిని (అదేవిధంగా దూతలను కూడా) పరిపాలించే ఏ హక్కునైతే వారు ఏదెను తోటలో పోగొట్టుకొన్నారో దానిని మరొకసారి వారికి తిరిగి ఇస్తున్నారు -

"తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను  వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను - అన్యజనములలో రాజులు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిమీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు. మీరైతే ఆలాగు ఉండరాదు; మీలో గొప్పవాడు చిన్నవానివలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజనపంక్తిని కూర్చుండువాడా పరిచర్యచేయువాడా? పంక్తినికూర్చుండు వాడేగదా? అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువానివలె ఉన్నాను. నా శోధనలలో నాతో కూడ నిలిచియున్నవారు మీరే; గనుక నాతండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని, సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రముల వారికి మీరు తీర్పుతీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను." (లూకా సువార్త 22:24-30)

"తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి." (యోహానుసువార్త17:24)

"దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము." (రోమా 8:14-17)

"ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు? తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే; శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే." (రోమా 8:31-34)

"పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీవలన లోకమునకు తీర్పు జరుగవలసియుండగా, మిక్కిలి అల్పమైన సంగతులనుగూర్చి తీర్పుతీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులనుగూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా?" (1కొరింథీయులకు 6:2-3)

"వీరందరు (దూతలు) రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?" (హెబ్రీయులకు 1:14)

"మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు - నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? నీవు దేవదూతలకంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసితివి, మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి, వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి. ఆయన  సమస్తమును లోపరచినప్పుడు వానికి లోపరచకుండ దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదుగాని దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు, దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము." (హెబ్రీయులకు 2:5-9)

"నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు; మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను." (ప్రకటన 2:26-28)

"నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను." (ప్రకటన 3:21)

"ఆ పెద్దలు - నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవుని కొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు." (ప్రకటన 5:9-10)

"అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక. తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడ రాజ్యము చేసిరి. ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుకలేదు; ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు." (ప్రకటన 20:4-6)

ఆవిధముగా, యేసుక్రీస్తు ప్రభువు మహిమపరచబడిన మనుష్యకుమారునిగా, నూతన సృష్టికి శిరస్సుగా, మహిపరచబడిన మానవజాతికి ఆరంభకునిగా, విశ్వాసులందరు దేవుని సృష్టియంతటిని తనతో కలసి పరిపాలించుటకు హక్కును సంపాదించియున్నారు!

ప్రభువైన యేసుక్రీస్తూ -  తమకే సదా స్తోత్రము కలుగును గాక! ప్రేమించబడుటకును, స్తుతించబడుటకును యుగయుగములు ఏలుటకును తాము మాత్రమే యోగ్యులు! ఆమేన్‌.

ఆంగ్ల మూలం - Jesus said that all authority was given to him, ... which means that Jesus cannot be God.


శాం షమూన్
ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు