సామాన్య ప్రశ్నలకు జవాబుల శ్రేణి

శాం షమూన్

ప్రశ్న:

దేవుడు చనిపోడు కదా, మరి యేసు క్రీస్తు ప్రభువు దేవుడైతే, ఆయన ఎలా చనిపోగలరు? యేసు చనిపోయి ఉన్న ఆ మూడుదినములు విశ్వమును నడుపుచుండినది ఎవరు?

జవాబు:

పై ప్రశ్నను వేసినవారు ఆ ప్రశ్నను ఏ కోణం నుండి వేస్తున్నారంటే - మరణము అనగా ‘ఉనికిలో లేకుండుట’ లేక ‘అభావముగా మారుట’, కాబట్టి యేసు చనిపోయారు అంటే, దేవుడు తన ఉనికిని నిలుపు చేశాడు లేక అభావముగా అయ్యాడు అని అర్థం కదా, కాని అది ఎన్నటికి జరుగలేని విషయం గదా! అనే భావనతో ఆ ప్రశ్నను వేస్తున్నారు. ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే వారు మరణమునకు తీసుకున్న నిర్వచనమే తప్పు . బైబిలులోని పరిశుద్ధ లేఖనముల ప్రకారము ‘మరణము’ - అనగా ‘ఉనికిలో లేకుండుట’ లేక ‘అభావముగా మారుట’ అని అర్థం కాదు గాని, అది “ఆదాము చేసిన తిరుగుబాటు ఫలితంగా మానవునికి మరియు దేవునికి మధ్య కలిగిన ఎడబాటు లేక వియోగము”. మొదటి మానవుడు చేసిన పాప ఫలితముగా రెండు రకముల వియోగములు లేక ఎడబాటులు సంభవించినవని పరిశుద్ద గ్రంథం చెప్పుచున్నది. అవేవనగా ఆత్మీయ మరణం మరియు భౌతిక మరణం. మొదటిది “ఆత్మీయ మరణము”, అనగా ఒక వ్యక్తికి దేవునితో ఉండవలసిన  అన్యోన్యమైన సహవాసమునుండి అతడు వేరు చేయబడి దేవుని ప్రేమనుండి ఎడబాటు పొందుట. అందువలన ప్రతి మానవునిపై దేవుని ప్రేమ నిలిచియుండుటకు బదులు దేవునియొక్క ఉగ్రత నిలిచియున్నది:

"మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా - ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను." ఆదికాండము 2:15-17.

నిషేధించబడిన చెట్టునుండి పండును తినుట ద్వారా దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తరువాత, నరుడు మరియు అతని భార్య ఏదెను తోటలోని దేవుని సహవాసమునుండి బహిష్కరించబడ్డారు:

"అప్పుడు దేవుడైన యెహోవా - ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకని వంటివాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షఫలమును కూడా తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని  దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను. అప్పుడాయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవుమార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను." ఆదికాండము 3:22-24.

పాపమునకు ఫలితముగా వచ్చిన ఈ ఆత్మీయ వియోగము (ఎడబాటు)ను గురించి లేఖనములు విస్తృతముగా తెలియజేస్తున్నాయి.

"నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు; చెడుతనమునకు (దుష్టునకు) నీ యొద్ద చోటులేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు; పాపముచేయు వారందరు నీకసహ్యులు. అబద్దమాడు వారిని నీవు నశింపజేయుదువు; కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు." కీర్తనలు 5:4-6 

"నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినయెడల  ప్రభువు నా మనవి వినక పోవును." కీర్తనలు 66:18  

"మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను; మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.'' యెషయా  59:1-2.

"వారు దుర్మార్గత ననుసరించి నడుచుకొనియున్నారు గనుక వారు యెహోవాకు  మొఱ్ఱపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక  ఆ కాలమందు వారికి కనబడకుండ తన్ను మరుగుచేసికొనును." మీకా 3:4.

"నీ కనుదృష్టి  దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా..." హబక్కూకు 1:13

"నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు... అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికి కూడా, శ్రమయు వేదనయు కలుగును." రోమా 2:5,8.

"మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రదికించెను. మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు అధిపతిని అనుసరించి, ఈ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి. అయినను  దేవుడు కరుణాసంపన్నుడైయుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత క్రీస్తుతో కూడ బ్రదికించెను. కృపచేత మీరు రక్షింపబడియున్నారు." ఎఫెసీయులకు 2:1-5.

చివర ఇవ్వబడిన వచనభాగములలో అపోస్తలుడైన పౌలుగారు ఎఫెసీయులకు వ్రాస్తూ, విశ్వాసులు క్రీస్తులో ఐక్యమగుట కొరకై నూతనముగ తిరిగి జన్మించుట అనే అనుభవము పొందుటకు పూర్వము, వారు తమ పాపముల చేత చచ్చినవారుగా ఉండేవారు అని తెలిపారు. అయినప్పటికినీ విశ్వాసులు తమ పాపముల చేత చచ్చినవారైనను ఇంకా జీవించుచూ సచేతనులుగా ఉండెడివారనేది మనందరికీ స్పష్టమే. వాక్యము చెప్పినట్లుగా పాపముల చేత చచ్చినవారు అనగా, వారు అంతటితో తమ ఉనికిని కోల్పోయారనో లేక అభావులై మనుగడలో లేకుండా పోయారనో కాదు గాని, దేవునితో ఉండవలసిన ప్రేమా ఐక్యతనుండి వేరైయుంటిరి అని తెలియచేస్తున్నది.

పరిశుద్ధగ్రంథము చెప్పే రెండవ రకమైన మరణము “భౌతిక మరణము”. అనగా ప్రాణము/ఆత్మ శరీరమునుండి వెడలిపోయి శరీరము అది దేనినుంచి తీయబడిందో ఆ నేల మంటిలో తిరిగి కలిసిపోవుట. దీని గురించి మనందరికీ తెలుసు కాబట్టి దీని గురించి మరి ఎక్కువగా ఇక్కడ చెప్పవలసిన అగత్యము లేదు.

అయితే మన పాపములను మోసిన మన ప్రభువైన యేసు క్రీస్తు మాత్రం మన కొరకు ఈ రెండు రకముల మరణములను అనుభవించారు. అనగా, దేవునితో తనకున్న అన్యోన్యమైన సహవాసానికి దూరమయ్యారు మరియు తన శరీరమునుండి ప్రాణము వెడలిపోయింది.

అయినప్పటికీ,  ఏ రకమైన మరణము కూడా ఉనికిని కోల్పోయి అభావమైపోవుటకాదు. ఉదాహరణకు క్రింద ఇవ్వబడిన సందర్భములను గమనించండి:

"ఇప్పుడైతే సీయోనను కొండకును  జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలయొద్దకును, క్రొత్తనిబంధనకు మధ్యవర్తియైన యేసు నొద్దకును హేబెలుకంటే మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు." హెబ్రీయులకు 12:22-24.

"ప్రాణము లేని శరీరమేలాగు మృతమో  అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము." యాకోబు 2:26.  

"ఆయన అయిదవ ముద్రను విప్పినపుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు - నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికియ్యబడెను; మరియు - వారివలెనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను." ప్రకటన 6:9-11.  

ఆసక్తికరమైన సంగతి ఏమంటే, పై ప్రశ్న వేస్తున్న ఆక్షేపకుడు అనుకుంటున్న మరణము యొక్క నిర్వచనము బైబిల్ ప్రకారము మాత్రమే తప్పు కాకుండా, ఖురాన్‍కు కూడా విరుద్ధమే!

"అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని "మృతులు" అనకండి. వాస్తవానికి వారు సజీవులు. కాని మీరు వారి జీవితాన్ని గ్రహించలేరు." సూరా 2:154.

"అల్లాహ్ మార్గంలో చంపబడ్డ వారిని మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులే. తమ ప్రభువు సన్నిధిలో ఆయన నుండి బహుమతులను పొందుచున్నారు. అల్లాహ్ వరములను పొంది వారు సంతోషముగానున్నారు. తమతో కలసిపోవుటకు రానున్న వారికొరకు కూడా సంతోషించుచున్నారు. ఎందుకనగా వారికి భయము లేదు, దుఃఖము లేదు." సూరా  3:170-171.

ప్రభువైన యేసు క్రీస్తు మాటలు ఈ విధంగా ప్రతిధ్వనించుచున్నాయి:

"పొదను గురించిన భాగములో -  ప్రభువు అబ్రాహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు, మృతులు లేతురని మోషే సూచించెను; ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించుచున్నరని వారికి ఉత్తరమిచ్చెను." లూకా 20:37-38  

కాబట్టి క్రీస్తు సిలువలో మరణించినప్పుడు జీవించుట చాలించలేదు. కానీ, పరిశుద్ధ గ్రంథము బోధించుచున్నట్లుగా ప్రభువు దేహము మూడు దినములు సమాధిలో నున్నప్పటికిని ఆయన ఆత్మ ఇంకా సచేతనముగా జీవించుచునే యుండినది.

"యేసు - ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. యూదులు - ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడు దినములలో దాని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమను దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని, లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి." యోహాను 2:19-22

నేను దాని మరల తీసికొనునట్లు నాప్రాణమును పెట్టుచున్నాను; ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణమును తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిననెను." యోహాను 10:17-18

క్రీస్తు తనను తాను మరణమునుండి లేపుకొనుట ఎప్పుడు సాధ్యం? తాను మరణించిననూ తన ఉనికిని కోల్పోకుండా సచేతనముగా జీవించుచున్నప్పుడు మాత్రమే అది సాధ్యం. కాబట్టి, క్రీస్తు దేహము సమాధిలో నుండిన ఆ మూడు దినములు, ఆయన తన ఉనికిని కోల్పోలేదు లేక జీవించుట చాలించలేదు అని మనకు స్పష్టముగా అర్థమగుచున్నది. క్రీస్తులోని దైవస్వభావం మరియు తనలోని మానవ ఆత్మ రెండూ ఆ సమయంలో కూడా సచేతనముగానే ఉండినవి.

కాబట్టి పై ప్రశ్నకు జవాబేమనగా - క్రీస్తు భౌతిక ఖాయం సమాధిలో నున్నప్పటికి, ఆయన సజీవునిగా ఉంటూ తన సర్వాధికారముతో తండ్రి మరియు పరిశుద్ధాత్మతో కలసి విశ్వమంతటిని సంరక్షించుచునే ఉంటిరి.

ఆంగ్ల మూలం:- If Jesus is God ... how can God die?


శాం షమూన్
ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు