యేసు క్రీస్తా? లేక ముహమ్మదా?

ప్రపంచంలో ఉన్న రెండు అతి పెద్ద మత వ్యవస్థాపకుల పోలిక
రచయిత సహో. సైలాస్

 పరిచయం

యేసు క్రీస్తు ప్రభువు క్రైస్తవ్యమును స్థాపించారు, ముహమ్మద్ ఇస్లాం మతాన్ని స్థాపించారు. ఇవి ప్రపంచంలోని రెండు అతి పెద్ద విశ్వాసములు. వీటిలో అనగా క్రైస్తవ్యములో 1.8 మరియు ఇస్లాంలో 1.1 బిలియన్ల సభ్యులు ఉన్నారు. నిస్సందేహంగా, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మానవ జాతిని చాలా శక్తివంతమైన విధానంలో ప్రభావితం చేశారు. వీరు మత నాయకులుగా లేక మత వ్యవస్థాపకులుగా మానవులు జీవించాల్సిన అనేక విలువలను తెలియజేసి స్థాపించారు.

ఈ రెండు మతములలోను అనేక విషయాలు సామాన్యంగా సమానముగా కనిపిస్తూ ఉన్నా, అనేక విషయాలలో విభేదిస్తూ కనిపిస్తుంటాయి. మరి ఈ రెండు అతి పెద్ద విశ్వాసముల వ్యవస్థాపకుల వ్యక్తిత్వం ఎలాంటిది? వారి ఇద్దరినీ పోలిస్తే ఎలా ఉంటుంది? యేసు క్రీస్తు ప్రభువారి గురించి బైబిల్ మరియు ఖురాన్ ఏమని సెలవిస్తునాయి? వారిద్దరిని అనుసరించేవారిని వారి బోధ మరియు వారి ప్రవర్తన  ఏవిధంగా ప్రభావితం చేస్తున్నాయి? ఈ వ్యాసంలో వారు బోధించిన కొన్ని మాటలు మరియు వారు చేసిన కొన్ని కార్యములు  పోల్చి చూచుట ద్వారా చదువరులకు వారి వ్యక్తిత్వాల మధ్య ఉన్న గొప్ప తేడా చూపించబడుతుంది.

గమనిక:- యేసుక్రీస్తు ప్రభువు మాటలు మరియు ఆయన చర్యలకు ఆధారంగా నేను తెలుగు బైబిల్‍ను, తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ వారి దివ్య ఖుర్‍ఆన్‍ను వాడుతున్నాను. ముహమ్మద్ జీవిత చరిత్రకై ఇబ్న్-ఎ-ఇస్‍హాక్ గారు వ్రాసిన "సీరత్ రసూలల్లాహ్" అనే పుస్తకాన్ని వాడుతున్నాను. చారిత్రక సంఘటనలకై సహీహ్ అల్ బుఖారీ హదీస్, సహీహ్ ముస్లిం హదీస్‍మరియు తబరీ వ్రాసిన చరిత్ర గ్రంథాన్ని కూడా వాడుతున్నాను. ఇంకా అబూ దావూద్ వ్రాసిన సున్నా పుస్తకాలను కూడా ఉంటంకిస్తాను. సాధారణంగా, సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీస్ పుస్తకములందు ముహమ్మద్ చేసిన క్రియలు మరియు ఆయన చెప్పిన మాటలు వ్రాయబడినవి. ముస్లిం పండితులు వీటిని ఎంతో ప్రాముఖ్యమైన గ్రంథాలుగా వ్యవహరిస్తుంటారు. ముహమ్మద్ జీవిత చరిత్ర విషయానికి వస్తే, ఇబ్న్-ఎ-ఇస్‍హాక్ గారు వ్రాసిన "సీరత్ రసూలల్లాహ్" అనే గ్రంథమును ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్త్యుత్తమ ముహమ్మద్ జీవిత చరిత్ర పుస్తకంగా పరిగణిస్తారు. తబరీ చరిత్ర గ్రంథాలను కూడా ముహమ్మద్ జీవిత చరిత్ర మరియు ఆ కాలంలో ఉండిన ఆదిమ ఇస్లాం చరిత్ర గ్రంథాలలోకెల్లా మేటి గ్రంథంగా పరిగణిస్తారు.


వారు పలికిన కొన్ని చివరి మాటలు

యేసు క్రీస్తు ప్రభువు:- "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను" (లూకా 23:34)
ఆయనను  మోసముతో అప్పగించి, నిష్కారణంగా ఆయనను కలువరి సిలువ మీద ఎక్కించిన సమయములో, మరణించే ముందు ఆయన పలికిన మాటలవి.
ముహమ్మద్:- "ప్రవక్తల సమాధుల దగ్గర వారి ఆరాధన స్థలాలను కట్టుకున్నారు కాబట్టి యూదులను మరియు క్రైస్తవులను అల్లాహ్ శపించును గాక." (బుఖారీ సహీహ్ 1:427)
ముహమ్మద్ అనేక సంవత్సరముల క్రితము ఒక యూదురాలి చేత విషాహారానికి గురయ్యాడు. ఎందుకనగా ఆమె భర్తను ముస్లింలు చంపారు. ఆ విషము ముహమ్మద్ శరీరంలో పనిచేయుట మొదలు పెట్టింది. తన భార్య అయిన ఆయిషా చేతిలో మరణిస్తూ ముహమ్మద్ పలికిన చివరి మాటలు అవి.  
వ్యాఖ్యానము:- నేను ఈ ఇరువురి జీవితాలను చదువుచుండినప్పుడు, ఈ ఇద్దరు పలికిన ఆ చివరి మాటలలో ఉన్న పెద్ద వ్యత్యాసమును గమనించాను. ఇక్కడ వారు చనిపోతూ పలికిన మాటలను మనము చదివాము, వారి జీవితం యొక్క అంతములో వారు పలికిన మాటలవి.  క్రీస్తు అయితే తన శత్రువులను సైతం క్షమించమని తన తండ్రిని అడిగారు, కాని ముహమ్మద్ తన ప్రవక్త హోదాను తిరస్కరించిన వారి మీదకు శాపం రావాలని అల్లాహ్‍ను వేడుకున్నాడు. తాను మరణిస్తున్న సమయంలో క్రైస్తవులను మరియు యూదులను సరి అయిన తన మార్గంలోకి అల్లాహ్ తేవాలని, వారికి సరైన మార్గదర్శకత్వం చేయాలని  కోరివుంటే ఎంతో బాగుండేది కదా?


బానిసత్వం

యేసుక్రీస్తు ప్రభువు:- ఆయనకు బానిసలు లేరు, ఇతరులు మీ పట్ల ఎలా ప్రవర్తించాలని మీరు కోరుతారో అదే విధంగా మీరు కూడా వారి పట్ల ప్రవర్తిస్తూ వుండాలని మనకు యేసుక్రీస్తు ప్రభువారు తెలిపారు. యేసు క్రీస్తు ప్రభువునకు బానిసలు అసలే లేరు. బానిసలు వుండాలని ఆయన బోధనలలో ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఆయన మనుష్యులను విడిపించి విడుదలనిచ్చారే కాని వారిని బానిసలుగా చేయలేదు. నిజానికి ఎవరు కూడా తమకు ఇష్టం లేకపోయినా బానిసలుగా బ్రతకాలని కోరరు కదా!
ఇంకా చెప్పలంటే, పరిశుద్ధ గ్రంథంలో ఇలా చదువుతాము -

"అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము, ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుషసంయోగులకును మనుష్యచోరులకును అబద్దికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధియైనవాడు మరి ఎవడైన ఉండినయెడల అట్టివానికిని నియమింపబడెను....." (1 తిమోతి 1:8-10)

ఈ వచనాలను చదివితే, మనుష్యులను బానిసలుగా చేయటం మరియు మనుషులతో వ్యాపారం చేయటం క్రైస్తవ బోధనలకు వ్యతిరేకమైనది మనకు తెలుస్తోంది.
ముహమ్మద్:- ఇతను ఒక బానిసల వ్యాపారి. అనేక మంది బానిసలను సొంతంగా కలిగి ఉండేవాడు, ఇంకా అనేక మందిని అమ్మేవాడు. వారిలో బానిస స్త్రీలు ఉండేవారు, పురుషులైన బానిసలూ ఉండేవారు. అయితే తాను మరియు తనను వెంబడించే ముస్లిం పురుషులు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు ఆ బానిస స్త్రీలతో యథేచ్ఛగా లైంగిక సంబంధాన్ని కలిగి ఉండేటట్టుగా అల్లాహ్ అనుమతి ఇచ్చాడని  చెప్పుకొన్నాడు. ఖురాన్ గ్రంథము, సూరహ్(అధ్యాయము) 33:50,52, 23:5 మరియు 70:30. ముస్లింలు ఆ బానిసలను తమకు దొరికిన కొల్ల సొమ్ముగా స్వీకరించేవారు, ఈ విధంగా వారు ముస్లింల కైవశమై (చేత చిక్కి) వారి ఆస్తిగా మారిపోయేవారు. ముహమ్మద్ కూడా అనేక వేలాది మందిని బానిసలుగా చేపట్టడాన్ని బట్టి చాలా అతిశయించేవాడు.

తన బానిసైన మర్యంతో ముహమ్మద్ కలిగి ఉండిన లైంగిక సంబంధాని గూర్చి గొప్ప చరిత్రకారుడైన తబరీ ఈ విధంగా వ్రాశాడు - "తన సొంత ఆస్తిగా ఆమెను పరిగణిస్తూ ఆమెతో లైంగిక సంబంధాని ఆయన కలిగి ఉండేవాడు." (తబరి, పుస్తకం 39, పేజి 194)

ముహమ్మద్ ఎవరి మీదనైతే దాడి చేసేవాడో, ఎవరితోనైతే యుద్ధాలు చేసేవాడో వారిలో నుండి మనుష్యులను బానిసలుగా పట్టుకొనేవాడు. మరి ముఖ్యంగా చెప్పాలంటే, యూదుల యొక్క బనూ కురైజ తెగకు చెందిన 800 మంది పురుషులను (యౌవనస్తులను మరియు అంతకంటే పై వయస్సు వారిని) ముహమ్మద్ చంపినప్పుడు వారి భార్యలను పిల్లలను బానిసలుగా పట్టుకున్న సందర్భము గమనించదగినది. సూరా 33:26 లో దాని వృత్తాంతం చదువుతాం. "సీరత్ రసూలల్లాహ్" అనే అతి ప్రాచీన ముహమ్మద్ జీవిత చరిత్ర గ్రంథంలో 461వ పేజీ మరియు దాని ముందు ఉన్న పేజీలు మనం చదివితే ఈ విషయాలు మనకు గోచరమవుతాయి. యూదులను  చంపిన వెనువెంటనే ఇలా జరిగిందని 466 వ పేజిలో ఇబ్న్-ఎ-ఇస్‍హాక్ వ్రాశాడు -

"అప్పుడు అపొస్తలుడు బను కురైజ అనే యూదుల తెగకు చెందిన వారి ఆస్తిని, వారి భార్యలను, పిల్లలను ముస్లింలకు పంచిపెట్టాడు. ఆ రోజునే గుఱ్ఱములకు మరియు పురుషులకు చెందవలసిన భాగములను కూడా ఆయన నియమించాడు. అందులో ఐదవ వంతును తాను స్వాధీనం చేసుకొన్నాడు, (అంటే ముహమ్మద్ మరియు అతని కుటుంబికులు ఆ యుధ్ధము యొక్క కొల్ల సొమ్ము అంతటిలో ఐదవ వంతు స్వాధీనం చేసుకొన్నారు)..... ఆ తరువాత అపోస్తలుడు సాద్‍ను పిలిపించి, బను కురైజకు చెందిన  కొంతమంది బానిస స్త్రీలను తీసుకువెళ్లి, వారిని అమ్మి గుఱ్ఱములను మరియు యుద్ధ సామగ్రిని కొనుమని సాద్‍ను ఆదేశించి పంపించాడు."    

ముహమ్మద్ అనేక మందిని తన స్వంత బానిసలుగా కలిగి ఉండేవాడు అని బుఖారీ సహీహ్‍లో, పుస్తకం 5:541 మరియు పుస్తకం 7:344లో చదువగలము. ముహమ్మద్ వద్ద నల్ల జాతీయులు, అరబ్బులు, ఐగుప్తీయులు, పురుషులు, స్త్రీలు, క్రైస్తవులు మరియు అరబ్బుకు చెందిన అన్య జాతీయులైన బానిసలు కూడా ఉండేవారు. బానిసలను అతి క్రూరంగా కొట్టుటకు కూడా ముహమ్మద్ అనుమతించాడు. తన భార్య వ్యభిచారం చేసిందో లేదో ముహమ్మద్ పరీక్షించే సమయంలో, ముహమ్మద్ అల్లుడైన అలీ, ఆయిషాకు చెందిన ఒక బానిస స్త్రీని ముహమ్మద్ ఎదుటనే అతి క్రూరంగా కొట్టాడు. ఎందుకు కొట్టాడంటే, ఆయిషాను గురించి నిజం మాత్రమే చెప్పాలని కొట్టాడు.

ఏ.గియాం (A. Guillaume) గారు  ఇంగ్లీష్‍లో "ది లైఫ్ ఆఫ్ ముహమ్మద్"(The Life of Muhammad) గా అనువదించిన సీరత్ రసూలల్లాహ్ (Sirat Rasulallah) అనే గ్రంథములో ఇబ్న్-ఎ-ఇస్‍హాక్ దీన్ని గూర్చి ఈ విధంగా వ్రాశాడు (పేజీ 496):

అపొస్తలుడు (ఆయిషా యొక్క బానిస స్త్రీయైన) బురైరహ్‍ను ఆయిషా గురించి విచారించడానికి పిలిచినప్పుడు, అలీ పైకి లేచి ఆమెను అతి క్రూరంగా కొడుతూ ఇలా అన్నాడు, "అపొస్తలునికి నిజం చెప్పు,".....

ఆ బానిసను కొట్టవద్దని ముహమ్మద్ అలీని నివారించలేదు.

అంతే కాకుండా కొత్తగా పట్టబడిన బానిస స్త్రీలతో లైంగిక కోరికలు తీర్చుకోవడానికి వారిని వాడుకోవచ్చని ముహమ్మద్ అనుమతించాడు. సహీహ్ ముస్లిం పుస్తకం 2:3371లో దీనిని చదువగలము -

"అబూ సిమ్రా, అబు సైద్ అల్ ఖుద్రీతో ఇలా అన్నాడు: "ఓ అబు సైద్, అల్లాహ్ యొక్క అపొస్తలుడు అల్-అజ్ల్ (coitus interruptus/అసంపూర్ణ రతి) గురించి చెప్పినపుడు నీవు విన్నావా?" అతడు ఇలా జవాబిచ్చాడు, "అవును విన్నాను. మేము అల్లాహ్ యొక్క అపొస్తలునితో పాటుగా ముస్తలిక్ మీద దాడికి వెళ్ళినప్పుడు కొంత మంది సుందరమైన అరబ్బు స్త్రీలను చెరపట్టాము, మా భార్యల నుండి వియోగంలో ఉంటిమి గనుక మేము వారిని  (మోహముతో) కాంక్షించాము, (కాని అదే సమయంలో) వారిని విడుదలచేయుట కొరకు వారి నుంచి పరిహారము పొందకోరితిమి. ఐతే వారితో అజ్ల్‌ని పాటిస్తూ (అజ్ల్ అనగా గర్భధారణ జరగకుండుటకై, వీర్యము విడుదల అగుటకు సరిగ్గా ముందుగా పురుషాంగాన్ని స్త్రీ యోనిలో నుండి బయటకు తీసేయటము) లైంగిక సంబంధాన్ని అనుభవిస్తూ రతి క్రీడలో ఆనందించాలని మేము కోరాము." ఐతే మేము ఇలా అన్నాము: "మనము ఈ కార్యము చేయుచుండగా మన మధ్య అల్లాహ్ అపొస్తలుడు ఉన్నాడు కదా; కాబట్టి ఇలాంటి కార్యముల గూర్చి ఆయనను ఎందుకు అడుగకూడదు?" కాబట్టి మేము అల్లాహ్ అపొస్తలుడిని ఈ విషయమై అడిగినప్పుడు ఆయన ఇలా అన్నాడు, "మీరు అలా అజ్ల్ పాటించకపోయినా ఫరవాలేదు, ఎందుకంటే చివరి దినము వరకు అనగా కయామత్ రోజు వరకు పుట్టవలసిన ప్రతి జీవి, ప్రతి ఆత్మ పుడుతుంది, పుట్టవలసిందే"."

మరియు సహీహ్ ముస్లిం పుస్తకం 3, 3432 హదీస్‍లో ఇలా ఉన్నది -

"హునైన్ యుద్ధ సమయంలో అల్లాహ్ అపొస్తలుడు ఔతాస్‍కు ఒక సైన్యాన్ని పంపి శత్రువులను ఎదిరించి పోరడవలసిందిగా ఆదేశించాడని  అబు సైద్ అల్ ఖుద్రీ తెలియచేశాడు. వారిని జయించి వారిని బానిసలుగా పట్టిన తరువాత, అల్లాహ్ యొక్క అపొస్తలుని అనుచరులు తమ బానిస స్త్రీలతో లైంగిక సంబంధాలను కలిగి ఉండకుండా వారికి దురంగా ఉంటిరి, ఎందుకంటే వారి భర్తలు విగ్రహారాధకులు కాబట్టి. అయితే సర్వోన్నతుడైన అల్లాహ్ ఈ విధంగా వారికి ఒక సవరణను క్రిందికి పంపాడు: - "ఇంకా ఇతరుల వివాహబంధంలో ఉండే స్త్రీలు కూడా మీకు హరామ్, మీ చేతికి యుద్ధంలో చిక్కిన స్త్రీలు తప్ప." (ఖురాన్ - 4:24) (అంటే వారి ఇద్దా లేక ఋతుస్రావపు సమయము సమాప్తమైనప్పుడు ఆ స్త్రీలు వారికి న్యాయబద్ధంగా మారుతారు)."

వ్యాఖ్యానము:- యేసు క్రీస్తు ప్రభువారి బోధనలలో మనకు ఏమి తెలుస్తోంది? మనుష్యులను బలవంతంగా చెరపట్టకూడదని ఆయన బోధించారు. "మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి." (లూకా 6:31)

అయితే దీనికి విరుద్ధంగా, ముహమ్మద్ మరియు అతని అనుచరులు అనేక మంది మీద దాడిచేస్తూ వెళ్ళి వారితో యుద్ధం చేసి అనేక మందిని బలవంతంగా బానిసలుగా చేరపట్టారు. ఇంకా ఘోరమైన పరిస్థితి ఏమిటంటే, తాను చేరపట్టిన ఆ బానిసల కుటుంబికులను ముహమ్మద్ విడదీసి తనకు ఇష్టమొచ్చినట్టుగా వారిని తన సైనికులకు పంచిపెట్టి, ఆ కుటుంబాలకు చెందిన స్త్రీలను మానభంగం చెయ్యాలని కామ దాహంతో ఉవ్విళ్ళూరిపోతున్న తన సైనికులకు తమకిష్టమైన స్త్రీలను బలవంతంగా చెరిచి మానభంగం చేస్తూ, ఆపుకోలేకపోతున్న తమ కామవికార కోరికలను తమ దేవుడి పేరిట యథేచ్ఛగా తీర్చుకొంటూ, యుద్ధంలో పట్టబడిన కారణంగా ఆ అమాయక పరస్త్రీలను బలవంతంగా వివస్త్రలుగా, నగ్నంగా మార్చి వారితో బలవంతపు రతిక్రీడలాడుకోవచ్చని అనుమతించాడు. ముహమ్మదు వారికి ఇచ్చిన ఇలాంటి అనుమతి ప్రకారమే మరెవరైనాసరే ఇంకొక ముస్లిం యొక్క భార్యతో వ్యవహరించి దానికి తన దేవుని పేరు ఆపాదిస్తే మీరు ఆ దేవుడిని దేవుడంటారా లేక సాతానంటారా? అలాంటి వాటిని ప్రోత్సహించే వాడిని దేవుని అపొస్తలుడంటారా లేక దొంగ అపొస్తలుడంటారా? భయపడకుండా చెప్పండి!


పాపము

యేసుక్రీస్తు ప్రభువు:- పాపరహితుడిగా జన్మించారు, పాపరహితమైన జీవితాన్ని జీవించారు, తన పాపరాహిత్యాన్ని యేసు ప్రభువారు ప్రస్తావించారు.

"నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?" (యోహాను 8:46)

ఇంకా -  

"ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసరము పాపముగా చేసెను." (2 కొరింథీ 5:21)
"పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును; ఆయనయందు పాపమేమియు లేదు." (1 యోహాను 3:5)
"మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను." (హెబ్రీ 4:15)

ముహమ్మద్:- ఇతడు ఒక పాపి అని ఖుర్‍ఆనే చెబుతోంది.

"నీ పాపాలకు క్షమాభిక్ష వేడుకో". (సూరహ్ 40:55)
"ఓ ప్రవక్తా! అల్లాహ్ నీ పూర్వపు పాపాలను, భవిష్యకాలపు పాపాలను క్షమించాలని మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము."(సూరహ్ 48:1,2)

(పై వచనాలలో పాపము అనుటకు అరబీ భాషలో వాడబడిన పదము - దన్బ్.  ఈ పదాన్నే పలుమార్లు ఖురాన్లో పాపము అని అనువదించారు కనుక, ఇక్కడ కూడా అదే అర్థం వస్తోంది.)

ముహమ్మద్ తన పాపాలు క్షమించబడాలని ప్రార్థన కూడా చేసేవాడు.

"ఓ అల్లాహ్, నేను గతంలో చేసిన లేదా భవిష్యత్‍లో చేయబోయే పాపాలను క్షమించు, రహస్యంగా నేను చేసిన పాపాలను మరియు బహిరంగంగా అందరి ఎదుట నేను చేసిన పాపాలను క్షమించు." (బుఖారీ సహీహ్, పుస్తకం 9, 482వ హదీస్)

ఇంకా చెపాలంటే, ముహమ్మద్ మనుష్యులను నిష్కారణంగా గాయపరచినట్టు మరియు హాని తలపెట్టినట్టు తనకై తానే ఒప్పుకున్నాడు కూడా.

"ఎవరి మీదనైతే అల్లాహ్ అపొస్తలుడు శాపాన్ని పంపుతాడో, అతను ఆ శాపానికి యోగ్యుడు కాకపోతే, అతని మీదకు ఆ శాపము ఆశీర్వచనంగానూ మరియు ఒక మంచి ప్రతిఫలంగానూ మారుతుంది." (సహీహ్ ముస్లిం, 4 వ పుస్తకం, 1525వ హదీస్)   

అంటే అమాయక ముస్లిములను కూడా ముహమ్మద్ పాపం నిష్కారణంగా శపించేవాడు.

హదీస్ 6287వ  సంఖ్య - "అల్లాహ్ అపొస్తలుడు ఈ విధంగా తెలిపాడు అని అబూ జురైర చెప్పాడు, ‘ఓ అల్లాహ్ నేనూ ఒక సామాన్యమైన మానవుడిని; ముస్లింలలో నేను ఎవరి గురించైనా కాని  చెడ్డ మాటలు మాట్లాడినా, ఎవరి మీదకైనా శాపాన్ని పంపినా, లేదా ఎవరినైనా నేను కొరడాలతో కొట్టించినా అది వారికి పవిత్రతకు మరియు దయకు కారణమయ్యేటట్లుగా చేయుము’".

అంటే అమాయక ముస్లిములను కూడా ముహమ్మద్ పాపం నిష్కారణంగా దూషించేవాడు, కొట్టించేవాడు. ఈ అజ్ఞాన చర్యలకు పాల్పడేవాడు అజ్ఞానే తప్ప దేవుని జ్ఞానం కలిగిన అపొస్తలుడు ఏ కోశాన చూసినా కాలేడు.

వ్యాఖ్యానము:- యేసు క్రీస్తు ప్రభువు పాపరహితుడు - దేవుని కుమారుడు. ముహమ్మద్ తనకు తానే ప్రవక్తగా ప్రకటించుకున్నవాడు, పాపము చేసే సామర్థ్యం కలవాడు మరియు అనేక తప్పిదములు చేసినవాడు. అతనిలో మంచి లక్షణాలు మరియు చెడ్డ లక్షణాలు రెండూ ఉండేవి. కొన్ని కొన్ని సార్లు దయ చూపించేవాడు, కొన్ని కొన్ని సార్లు అనేక మందికి హాని చేసేవాడు, అనేక మందిని శపించాడు. మరి ఈ ఇరువురి వ్యక్తిత్వాలు లేదా వారి గుణగణాలు ఆయా మతాల్లో ఎంత మట్టుకు జీర్ణించుకుపోయుంటాయి? లేదా ఎంత మటుకు కనిపిస్తున్నాయి? యేసుక్రీస్తు పవిత్రుడు, పాపరహితుడు, ఐతే ముహమ్మద్ తన పాపాలను క్షమించమని దాదాపు రోజుకు 70,000 సార్లు ప్రార్థన చేసుకొన్నట్టుగా తానే తెలియచేశాడు! ఇప్పుడు చెప్పండి మీరెవరిని వెంబడిస్తారో? 



పశ్చాత్తాప పడడానికి సిద్ధంగా ఉన్న పాపులను సైతం శిక్షించడం

యేసు క్రీస్తు ప్రభువు:-

యోహాను సువార్త 8:2-11

"తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోకి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొవచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి  -బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను; అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి. ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో (ఏమో) వ్రాయుచుండెను. వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి -మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, మరల వంగి నేలమీద వ్రాయుచుండెను. వారామాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకనివెంట ఒకడు బయటికి వెళ్లిరి యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడి యుండెను. యేసు తలయెత్తి చూచి - అమ్మా, వారెక్కడనున్నారు? ఎవడును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు, ఆమె - లేదు ప్రభువా అనెను. అందుకు యేసు - నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్లి ఇకను పాపము చేయకుమని ఆమెతో చెప్పెను."

ముహమ్మద్:-
అబూ దావూద్ వ్రాసిన హదీస్ 4428వ సంఖ్య -

బురైదహ్ ఇలా అన్నాడు " గామిద్ తెగ నుంచి ఒక స్త్రీ వచ్చి ప్రవక్తతో ఇలా అన్నది - "నేను జారత్వం జరిగించాను." అందుకు ప్రవక్త ఆమెతో "తిరిగి వెళ్ళు" అన్నాడు. ఆమె తిరిగి వెళ్లి మరుసటి రోజు వచ్చి, ఇలా అన్నది: "బహుశా మైజ్ బిన్ మాలిక్‍ని నీవు తిరిగి పంపివేసిన విధంగా నన్ను కూడా పంపివేయాలని కోరినట్టున్నవు. నేను అల్లాహ్ పేరిట ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను ఇప్పుడు గర్భవతిగా ఉన్నాను." అప్పుడు అతడు ఆమెను  తిరిగి వెళ్ళమని  అన్నాడు. ఆమె తిరిగి వెళ్లి మరుసటి దినము మళ్ళీ అతని దగ్గరకు వచ్చింది, అప్పుడు అతను ఆమెతో, "తిరిగి వెళ్ళు" అన్నాడు. ఆమె తిరిగి వెళ్లి మరుసటి దినం మళ్ళీ అతని దగ్గరకు వచ్చింది. అతను ఆమెతో, "ఆ బిడ్డను నీవు కనేవరకు నీవు తిరిగి వెళ్ళు" అన్నాడు. ఆమె తిరిగి వెళ్ళిపోయింది. ఆ బిడ్డను కన్న తారువాత ఆ బిడ్డను అతని దగ్గరకు తీసుకు వచ్చింది. అప్పుడు ఆమె ఇలా అన్నది, "ఇదిగో ఈ బిడ్డ! దీనిని నేను కన్నాను." అప్పుడు అతను ఇలా అన్నాడు: "నీవు తిరిగి వెళ్ళు, ఆ బిడ్డ పాలు మరిచే వరకు ఆ బిడ్డకు పాలిచ్చి పెంచు." ఆమె ఆ బిడ్డకు పాలు మాన్పిన తరువాత, ఆ చిన్నబిడ్డ చేతిలో ఏదో పట్టుకొని తినుచుండగా అతని ముందుకు ఆ బిడ్డను తీసుకు వచ్చింది. అప్పుడు ప్రవక్త  ఆ బిడ్డను ముస్లిములలో ఒకతనికి అప్పగించి, ఆమెకు ఏమి చేయాలన్న విషయాని ప్రస్తావించాడు. ఆమె కోసం ఒక గుంతను త్రవ్వారు, తరువాత వెంటనే ఆమెను రాళ్ళతో కొట్టి చంపమని ఆదేశించాడు.  ఖలీద్ ఆమె మీదకు రాళ్ళు విసిరిన వారిలో ఒకడు. అతడు ఆమె మీదకు ఒక రాయిని విసిరాడు. ఒక రక్తపు చుక్క అతని చెంప మీద పడ్డప్పుడు ఆమెను దూషించాడు. అప్పుడు ప్రవక్త అతనితో ఏమన్నాడంటే - "మృదువుగా, ఖలీద్. ఎవని చేతిలో నా ప్రాణమున్నదో అతని సాక్షిగా చెబుతున్నాను, ఆమె ఎంతగా పశ్చాత్తాప పడిందంటే, ఎవడైనా కాని మోసపూరితంగా ఎక్కువ పన్ను ప్రజలనుంచి వసూలు చేసి పట్టుబడితే, అటువంటి వాడు గనుక ఇంతగా పశ్చాతాప పడితే, వాడిని నిస్సందేహంగా క్షమించి ఉండేవాడిని. తరువాత ఆమె గురించి ఆదేశం ఇస్తూ, ఆమె కోసం ప్రార్థించాడు, పిదప ఆమెను సమాధి చేశారు.

వ్యాఖ్యానము:- ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య చాలా గొప్ప తేడా మనము ఇక్కడ గమనిస్తున్నాము. యేసు ప్రభువారు, వ్యభిచారమందు పట్టబడిన ఒక  స్త్రీని కనుగొనినప్పుడు, ఆమెకు ఆయన తీర్పు తీర్చలేదు, కాని నీవు వెళ్ళి ఇక మీదట పాపము చేయవద్దు అని చెప్పారు. ఆమె దాని నుండి విడుదల పొందడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు.  ఆమె నిజంగా ఆ అవకాశం మూలంగా పూర్తి పరివర్తన పొంది, అలాంటి పాప పంకిలము నుండి క్రీస్తు ప్రభువు ద్వారా విడుదల పొందటం నిజంగా సాధ్యమే అని అనేక మందికి సాక్ష్యమిస్తూ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన దయ చూపించిన ఆ విధానము అనేక మందికి ఆదర్శనీయము.

ఎంత మంది తప్పు దారిలో వెళ్ళలేదు? ఎంతో మంది తప్పు దారిలో వెళ్ళినా కాని తరువాత తమ జీవితాలను మార్చుకోలేదా? అంతే కాకుండా, అలాంటి తప్పుదారిలో ఉన్నవారు అనేక మంది తమ జీవితాలను మార్చుకొనే విధంగా వారు ఇతరులకు సహాయ పడలేదా? ఇలాంటి అవకాశాన్ని యేసు ప్రభువారు ఆ స్త్రీకి ప్రసాదించారు. ధర్మశాస్త్ర  ప్రకారం యూదులు ఆ స్త్రీని చనిపోయేంత వరకు రాళ్ళతో కొట్టి చంపాల్సినది. ఐతే యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ మరియు దయ అంతకంటే గొప్పవి.

ఐతే ముహమ్మద్ యొక్క ప్రవర్తన చాలా వ్యత్యాసంగా కనిపిస్తోంది. మొదట్లో చుస్తే ఆ వ్యభిచారము చేసిన ఆ స్త్రీని అతను ఇంటికి పంపించి వేసినట్టుగా కనిపిస్తుంది. ఆమె ఏడ్చి తన పాపాన్ని అతని దగ్గర ఒప్పుకున్నది, కాని ఆమె పలికిన పశ్చాత్తాపపు మాటలు అతను పట్టించుకోకుండా ఆమె పట్ల కఠినంగా ప్రవర్తించాడు. ఆమెను తిరిగి వెళ్లిపోమని చెప్పాడు. ఇలా మూడుసార్లు జరిగింది. మూడు సార్లు కూడా ముహమ్మద్  పరిస్థితిని పట్టించుకోకుండా పరిస్థితికి దూరంగా పారిపోయాడు. చివరిగా ఆ స్త్రీ మాటి మాటికి వచ్చి తన పాపాన్ని ఒప్పుకుంటూ రాగా, ముహమ్మద్ ఆమె విషయంలో ఏదో ఒక తీర్పు తీర్చాలనుకున్నాడు.  ఆమెను ప్రసవించడానికి అనుమతించాడు, బిడ్డకు పాలిచ్చి పెంచిన తరువాత పాలు మాన్పించమని చెప్పాడు. అంటే దాదాపుగా ఒకటి నుంచి మూడు సంవత్సరాల సమయం దీనికి పట్టి ఉంటుంది. అప్పుడు ఆమె తిరిగి రాగా ముహమ్మద్ ఆమెను చంపించేశాడు.

ఇక్కడ చూసినట్లయితే, ఈ స్త్రీ తన పాపమును ఒప్పుకోవడమే కాకుండా పశ్చాతాపం పొందింది కూడా. ఆమె తన బిడ్డకు మంచి తల్లిగా మారింది. ఈ విధంగా ఆమె సమాజంలోఒక బాధ్యత గల స్త్రీగా మారింది. అనేక రకాల పాపాలు చేసిన అనేక మందిని తాను వదిలేసినట్టుగానే ఈమెను కూడా ముహమ్మద్ క్షమించి వదిలేయలేడా? అతను అనేక మంది చేసిన పాపములను తేలికగా వదిలేశాడు. తన స్వంత కుటుంబ సభ్యులను హత్య చేసిన వారిని కూడా - దేవుడు ఒక్కడే మరియు ముహమ్మద్ దేవుని ప్రవక్త అని వారు ఒప్పుకున్న వెంటనే - విడిచిపెట్టాడు. హంతకులయినవారిని కూడా విడిచిపెట్టేవాడు. కానీ ఆ  స్త్రీపట్ల మాత్రం ముహమ్మద్ దయగా పవర్తించలేకపోయాడు. అతని ముక్కుకి అవతల కొంచెం దూరంలో ఏముందో కూడా అతనికి కనపడనంత హస్వదృష్టి, చిన్నచూపుగలవాడు. తన జీవితాన్ని ఆమె మార్చుకుంది, బాగుపడింది అన్న విషయాని గ్రహించలేకపోయాడు. తన బిడ్డని చక్కగా చాకింది అన్న విషయాని తాను గుర్తించలేకపోయాడు. తను చేయవలసిన విధులనన్నిటినీ చక్కగా నెరవేరుస్తున్నది అని గుర్తించలేకపోయాడు. ముహమ్మద్‍కు ఉన్న ఈ హస్వదృష్టి లేదా దూరదృష్టిలోపం ఆమె దారుణ మరణానికి దారి తీసింది.

నిజానికి, ముహమ్మద్ ఆమె పట్ల యూదుల ధర్మశాస్త్ర ప్రకారము ప్రవర్తించినట్లుగా కూడా మనము చూడము. మోషే ధర్మశాస్త్రములో, వ్యభిచారులను రాళ్ళతో కొట్టి చంపాలని ఉంది, కాని ముహమ్మద్ అలా చేయలేదు. ఆమె అనేక సంవత్సరాలు జీవించే విధంగా అనుమతించాడు. మరి పుట్టవలసిన బిడ్డకు ఆమె జననము ఇవ్వవలిసి ఉండుటనుబట్టే ఆమెకు ఆ గడువు ఇచ్చాడు అని అనుకున్నా, ఆ చిన్న బిడ్డకు ఆమె పాలు మాన్పించే వరకు కూడా ముహమ్మద్ వేచి ఉన్నాడు. మరి నిజానికి చూస్తే ఈ స్త్రీ కాకుండా ఇతర స్త్రీలు ఆ బిడ్డకు పాలిచ్చి పెంచి ఉండవచ్చు కదా? బిడ్డ పెరిగిన తరువాత వాని తల్లిని చంపుట ద్వారా ఇప్పుడా బిడ్డ అనాథగా మారలేదా? వాని ఆలనా పాలనా చూసేది ఎవరు? తన కళ్ళ ఎదుటే తన తల్లిని అతి పాశవికంగా చంపుతుంటే ఆ బిడ్డ ఎలా గుండెపగిలేలా రోదించి ఉండొచ్చు? ఇది ఎంతటి కిరాతకం? దీనిని బట్టి మనకు తెలుస్తోంది ఏమంటే, ఆయా పరిస్థితులలో ముహమ్మద్ తనకు ఏది ఇష్టమనిపిస్తే అలా ప్రవర్తించాడు కాని సరైనదానిని చేయలేదు. కాలం గడుస్తుండగా ముహమ్మద్ తన సొంత నియమాలను, తన సొంత సూత్రాలను ఏర్పరచుకుంటూ వాటి ప్రకారం ప్రవర్తిస్తూ వచ్చాడు.


యుద్ధము - విరోధుల పట్ల ప్రవర్తించడం

యేసు క్రీస్తు ప్రభువు:- లుకా సువార్త 9:54,55 వచనాలలో తనని అంగీకరించని ఒక పట్టణమును నాశనమును చేయాలని తన శిష్యులు ఆలోచించినప్పుడు, యేసుక్రీస్తు వారిని గద్దించారు. అంతేకాకుండా, లుకా సువార్త 22:52 వచనములో యేసును బంధించడానికి వచ్చిన వారితో పోరాడాలని శిష్యులు  ప్రయత్నించినపుడు యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను నివారించారు. అంతేకాకుండా ఆ జగడంలో బంధించడానికి వచ్చిన వారిలో ఒకరికి గాయమైనపుడు యేసు  ప్రభువు తనకు విరోధిగా వచ్చిన వానిని కూడా స్వస్థ పరిచారు.

ముహమ్మద్:- ముహమ్మద్ మాత్రం ముస్లింలు కాని మిగతా వారితో క్రూరంగా యుద్ధం చేయండి అని బోధించాడు అని సురా 9:5,29లో చదువగలం. సురా 9 ముహమ్మద్ ఇచ్చిన చివరి సురాలలో ఒకటి. ప్రారంభదినాలలో మహమ్మద్ యొక్క గుంపు బలహీనంగా ఉండినందున, అప్పుడు మిగితా వారిని చూసీ చూడనట్టుగా విడిచిపెట్టాలని శిష్యులకు ఆదేశించేవాడు. ఎప్పుడైతే ముస్లింలు బలవంతులుగా మారారో, ఇస్లాంను బలవంతంగా వ్యాపింపచేయలని ఆదేశించాడు. మొదటి ఖలీఫాలైన అబూ బక్ర్, ఉమర్ మరియు ఉత్మాన్‍లు కూడా అతను చెప్పిన ఈ ఘోరమైన యుద్ధాలను వారి వారి కాలములలో కూడా కొనసాగించారు.
    
ముహమ్మద్ చేసిన కొన్ని కార్యాలను మనం చూద్దాం -

అతను చెరపట్టిన ఎనిమిదివందల మంది యూదుల పురుషులను అతను చంపించాడు. ఈ విషయాన్ని మనం సురా 33:26లో చదవగలం. అతను మక్కాను కైవశం చేసుకున్నప్పుడు అందులో ఉన్న పదిమంది మనుష్యులను చంపించాడు. అందులో ముగ్గురు అంతకుముందు ముహమ్మద్‍ని వెక్కిరించిన బానిస స్త్రీలు. ఈ విషయాన్ని మనము ది లైఫ్ ఆఫ్ ముహమ్మద్ (The Life of Muhammad) అనే పుస్తకంలో పేజి నెంబరు 551 మరియు 552 లో చూడవచ్చు. యూదుల నగరమైన ఖైబర్ మీద దాడిచేసి పట్టుకునప్పుడు, అందులో ఉన్న ఒక యూదుల నాయకుడిని పట్టుకొని, అతను భూమిలో దాచిపెట్టిన ధనం ఎక్కడ ఏ ప్రాంతములో దాచిపెట్టాడో చూపించవలసిందిగా అతడిని చిత్రవధ చేశాడు. అయితే అతడు మరణానికి దగ్గరవుతూ కూడా మాట్లాడడానికి నిరాకరించినపుడు, ముహమ్మద్ అతని తలని కోసేసి వేరుచేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఈ విషయాన్ని మనము ది లైఫ్ ఆఫ్ మహమ్మద్ అనే పుస్తకంలో పేజి నెంబరు 515 లో చదువగలరు.

వ్యాఖ్యానము:- కొన్ని సంవత్సరముల క్రితం తనను వెక్కిరించింది కదా అనే సాకుతో యేసుక్రీస్తు ప్రభువు బానిస స్త్రీలను చంపించగలరు అని కనీసం ఎవరూ ఊహించనైనా ఊహించలేరు. నిజానికి యేసుక్రీస్తు ఒక ఉత్తమమైన జీవన విధానాన్ని, ఉత్తమమైన సందేశాన్ని బోధించారు. భూమిలో నిక్షిప్తం చేయబడిన ధనం ఎక్కడుందో చెప్పవల్సిందిగా ఒక మనుష్యుని యేసు ప్రభువు చిత్రవధ చేయగలరని కూడా ఎవరూ ఊహించనైనా ఊహించలేరు. ఎందుకంటే ఆయన జీవితం ఆశలేనిది, ఆశాపాతకత్వము అంతకంటే లేనిది.

ముహమ్మద్ చాల క్రూరమైన మనిషి. తనను వెక్కిరించారన్న చిన్న నెపంతో అతను కొంతమంది స్త్రీలను దారుణంగా చంపించడం ఏవిధంగా న్యాయ సమ్మతము? ఆ కారణంచేత వారిని అతను చంపించడం వివేకమనిపిస్తోందా? హేతుబద్ధముగానైనా ఉన్నదా? ఒక మనిషి తన డబ్బును ఎక్కడ నిక్షిప్తం చేశాడో చెప్పనంత మాత్రాన అతడిని హింసించి చంపిన మహమ్మద్‍ను ప్రపంచ సమాజం అనుసరించదగిన ఆదర్శప్రాయుడిగా మనము పరిగణించగలమా? అతనికి విధేయత చూపించి అతనిలాంటి ప్రవర్తన మనమూ ఇలాగే కలిగి వుండవచ్చా? ఇంకొకరెవరో వచ్చి నీపట్లో నీ కుటుంబంపట్లో సరిగ్గా ఇలాగే ప్రవర్తిస్తే, వాహ్! నా కుటుంబికులను ఇలా కిరాతకంగా చంపటం ఎంత బాగుంది? ఎంత రంయంగా, మనోహరంగా ఉంది అంటావా? లేక గుండె పగిలేలా ఏడుస్తూ అలా చేసిన వాడిని శపిస్తావా? ధైర్యంగా చెప్పు! ఇలాంటి వాడు దైవ ప్రవక్త ఎలా కాగలడు?


స్త్రీలు మరియు వివాహము

యేసుక్రీస్తు ప్రభువు:- ఆయన వివాహము చేసికొనలేదు. ఆయన స్త్రీలను స్వస్థపరిచారు, స్త్రీలను క్షమించారు, స్త్రీలకు ప్రొత్సాహము ఇచ్చారు. క్రొత్త నిబంధనలో భర్తలు తమ భార్యలను ప్రేమించాలని, వారిపట్ల కఠినంగా వ్యవహరించకూడదని కొలస్సీ 3:19, ఎఫెస్సీ 5:25లో చదువుతాము. దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమని గలతీ 3:28 లో చదువుతాము. స్త్రీలని గౌరవించాలని 1 పేతురు 3:7లో చదువుతాము.

ముహమ్మద్:- అవిధేయత చూపించిన భార్యలను, వారి భర్తలు కొట్టవలసిందిగా ముహమ్మద్ తన శిష్యులకు బోధించాడు. ఈ విధంగా తమకు విధేయులు కాని స్త్రీలను కొట్టే హక్కును తన శిష్యులకు ఇచ్చాడు.

"ధిక్కరిస్తారనే భయం మీకు ఏ స్త్రీల విషయంలో కలుగుతుందో వారికి నచ్చజెప్పండి. పడక గదులలో వారికి దూరంగా ఉండండి, మరియు కొట్టండి." (సురా 4:34)

పై వచనము ఒక స్త్రీ గురించి ఇవ్వబడింది. తన భర్త తనను ముఖము (చెంప) మీద కొట్టాడని ముహమ్మద్‍కి ఫిర్యాదు చేయవచ్చిన ఒక స్త్రీ గురించి పైన చెప్పబడింది. ఆ చెంపదెబ్బ అప్పటికి కూడా ఆమె ముఖము మీద కనిపిస్తూ ఉండినది. "అతనితో రాజీపడు" అని మొదట్లో ముహమ్మద్ ఆ స్త్రీతో అన్నాడు. తర్వాత "వేచియుండు, ఆలోచించి చెప్తాను" అన్నాడు. తర్వాత పైనున్న వచనము నాకు బయలుపరచబడింది అన్నాడు. ఆ తరువాత, "మేము (నేను ఆ స్త్రీ) ఒకటనుకున్నాము కాని అల్లాహ్ మరొకటనుకున్నాడు" అని అన్నాడు. హదీస్‍లలో స్త్రీల గురించి అనేక విషయాలు వ్రాయబడ్డాయి. "స్త్రీలు స్వాభావికంగా చాలా చెడ్డవారు, అందువల్ల నరకంలో ఉన్నవారిలో ఎక్కువుగా స్త్రీలే ఉంటారు" అని ముహమ్మద్ అన్నాడు.

ఇక బుఖారీ గ్రంథాన్ని చుద్దామా?

పుస్తకం 1, 301 హదీస్ - "ఓ స్త్రీలారా! దానం చేయండి, నరకంలో ఉన్న అత్యధికులు స్త్రీలే. అప్పుడు స్త్రీలు ఇలా అడిగారు, "ఓ అపొస్తలుడా ఎందుకు అలాగ?" అతను ఇలా జవాబు ఇచ్చాడు, "మీరు మాటిమాటికి శపిస్తుంటారు, మీ భర్తల పట్ల అవిశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు."    

బుఖారీ సహీహ్, పుస్తకం 1, 28 వ హదీస్ -

ప్రవక్త ఇలా అన్నాడు, "నాకు నరకాగ్ని చూపించబడింది, అందులో అత్యధికులు విదేయత లేని స్త్రీలే." అప్పుడతడిని వారు (స్త్రీలు) ఇలా అడిగారు, "అంటే వారు అల్లాహ్‍ని నమ్మని స్త్రీలా? లేదంటే అల్లాహ్ పట్ల కృతజ్ఞత లేనివారుగా ఉన్నారా?" ఆయన ఇలా జవాబిచ్చాడు, "వారు తమ భర్తల పట్ల కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు, వారికి చేయబడిన మేళ్లను, మంచిని మరచి కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు."   

సహీహ్ ముస్లిం పుస్తకంలో, జన్నత్‍లోకి స్త్రీలు తక్కువ సంఖ్యలో చేర్చబడుతారు అని చెప్పబడింది.

పుస్తకం 4, 6600 హదీస్‍-

"అల్లాహ్ అపొస్తలుడు ఇలా అన్నట్లుగా ఇమ్రాన్ హుస్సైన్ తెలియజేస్తున్నాడు - ‘జన్నత్‍లో నివసించేవారిలోకెల్లా స్త్రీలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు’."
ఈ రెండు హదీస్‍లను చేర్చిచూస్తే, జన్నత్‍లో స్త్రీలు అల్పసంఖ్యాకులుగా ఉంటారు అని, అంతేకాకుండా నరకంలో అత్యధికంగా ఉంటారు అని ముహమ్మద్ చెప్పినట్లు గ్రహిస్తాము. ఎందుకంటే, స్త్రీలు పురుషులకంటే పాపభరితమైనవారు అని ముహమ్మద్ చెప్పేవాడు. స్త్రీలు నరకంలో ఉండటానికి కారణం ఏమంటే తమ భర్తలపట్ల కృతజ్ఞత లేనివారిగా జీవించడమే అని చెప్పాడు. అంతేకాకుండా పురుషులకంటే స్త్రీలు తక్కువ జ్ఞానం కలవారని ముహమ్మద్ పేర్కొనేవాడు.

బుఖారీ సహీహ్, పుస్తకం 1, 301వ హదీస్ -   

"......ముహమ్మద్ స్త్రీలను దాటి వెళుతూ ఈ విధంగా అన్నాడు - "ఓ స్త్రీలారా, నరకాగ్నిలో ఉన్న అధిక సంఖ్యాకులు స్త్రీలే అని నేను చూశాను. కాబట్టి మీరు అధికంగా దానం చేయండి." వారప్పుడిలా అడిగారు - "ఓ అల్లాహ్ అపోస్తలుడా ఎందుకలాగ?" ముహమ్మద్ ఇలా జవాబు ఇచ్చాడు - "మీరు మాటిమాటికి శాపవచనాలు పలుకుతుంటారు లేక శపిస్తుంటారు. అంతేకాకుండా మీ భర్తల పట్ల కృతజ్ఞత లేనివారుగా జీవిస్తుంటారు. మీకంటే తెలివి తక్కువ వారిని కాని, తక్కువ మతాసక్తి గలవారిని కాని ఇంతవరకు చూడలేదు అని అన్నాడు. చాలా జాగ్రత్తగా, మెళకువగా నడుచుకునే ఒక పురుషుడిని కూడా మీలో కొందరు దారి తప్పిస్తారు." అప్పుడు ఆ స్త్రీలు ఇలా అడిగారు - "ఓ అల్లాహ్ అపొస్తలుడా! మా మతాసక్తిలోనూ, మా తెలివితేటలలోనూ కొరవడినది (తక్కువ పడ్డది) ఏమిటి?" అతనప్పుడు ఇలా అన్నాడు - "ఒక్క పురుషుడు ఇచ్చే సాక్షానికి ఇద్దరు స్త్రీల యొక్క సాక్షము సమానమని మీరు వినలేదా?" అప్పుడు వారు "విన్నాము" అన్నారు. ముహమ్మద్ అప్పుడు - "వారి జ్ఞానము మరియు తెలివితేటల్లో ఉన్న కొదువ లేక లోపం ఇదే" అన్నాడు.  

వ్యాఖ్యానము:- క్రీస్తు ప్రభువారి బోధనల్లో స్త్రీ పురుషులు దేవుని దృష్టిలో సమానమనే విషయాన్ని మనము చూస్తాము.

"క్రీస్తునందు పురుషుడు స్త్రీ అన్న భేదం లేదు." (గలతీ 3:28)  

బానిసలకు మరియు స్వేచ్ఛ గలవారికి మధ్యస్థానములో స్త్రీలను ఉంచుతాడు ముహమ్మద్. ఈనాటికి కూడా ఇస్లామీయ దేశాలలో స్త్రీలను రెండవ తరగతికి చెందినవారిగానే చూస్తారు. ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే, ముహమ్మద్ బోధించిన  బోధనలలో వారికిచ్చిన స్థానం అలా ఉంది కాబట్టి.     


క్రీస్తు యొక్క సారూప్యత లేక గుర్తింపు

యేసుక్రీస్తు ప్రభువు:- తాను దేవుని కుమారుడనని చెప్పారు. యోహాను సువార్త 5:18-27, 10:36, మత్తయి సువార్త 26:63,64.

"అందుకాయన -మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారినడిగెను. అందుకు సీమోను పేతురు - నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు - సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలు పరచెనేగాని నరులు నీకు బయలుపరచలేదు." (మత్తయి 16:15-17) 

యేసుక్రీస్తు ప్రభువు దేవుని వాక్యము

"ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి." (యోహాను సువార్త 1:14)

యేసుక్రీస్తు ప్రభువు దేవుడు

"క్రీస్తుయేసుకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగాపుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్నుతానే రిక్తునిగా చేసికొనెను." (ఫిలిప్పీ 2:5-7)

ముహమ్మద్:-
ముహమ్మద్ మాత్రం యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు కాదు అన్నాడు.  ప్రవక్తల మధ్యన ఖురాన్ గ్రంథము ఏ భేధమును చూపించదు, మరియు యేసుప్రభువు కూడా కేవలం ఒక సందేశకుడు లేక ప్రవక్త మాత్రమే అని అన్నాడు.

సురా 5:75 - "మర్యం పుత్రుడైన మసీహ్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. ఆయనకు పూర్వం కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు."

యేసు క్రీస్తు ప్రభువు యొక్క దైవ స్వభావాన్ని ఖురాన్ తిరస్కరిస్తుంది.

సురా 43:59 - "మర్యం పుత్రుడు ఒక దాసుడు తప్ప మరేమీ కాదు. మేము అతనిని అనుగ్రహించాము, ఇస్రాయీల్ సంతతి వారికి అతనిని మా శక్తికి నిదర్శనంగా చేశాము."

సురా 3:59 - "అల్లాహ్ దృష్టిలో ఈసా పుట్టుక ఆదం పుట్టుక వంటిదే. అల్లాహ్ ఆదమును మట్టితో చేసి "అయిపో" అని ఆజ్ఞాపించాడు, అతను అయ్యాడు."

వ్యాఖ్యానము:-
క్రీస్తు ఒక గొప్ప బోధకుడు మరియు ప్రవక్త మాత్రమే కాకుండా, తాను దేవుని కుమారుడనని, దేవుని వాక్యాన్ని అని, మెస్సీయ్యానని, శరీరధారి అయిన దేవుడనని కూడా బోధించారు. ముహమ్మద్ దీనిని తిరస్కరించాడు. నిజానికి యేసు ప్రభువు సత్యమే చెప్పి ఉండాలి లేకపోతే అబద్ధికుడైనా అయివుండాలి లేక పిచ్చివాడైనా అయివుండాలి. క్రీస్తు యొక్క వ్యక్తిత్వ విషయంలో వీరిరువురూ చెప్పిన మాటల్లో ఒక్కరిదే వాస్తవం అయివుండాలి. జ్ఞాపకం పెట్టుకో, యేసుక్రీస్తు ప్రభువుకు 600 సంవత్సరముల తర్వాత తనకు ప్రత్యక్ష్యతలు కలిగాయంటూ ముహమ్మద్ ఎడారిలోంచి తిరుగులాడుతూ బయటికి వచ్చాడు. తాను మాట్లాడుతున్న విషయాలపైన తనకే(మహమ్మద్) సరైన అవగాహాన ఉండేది కాదు. బైబిల్ గ్రంథము దేవుని వాక్యమని చెబుతూ కూడా అనేకసార్లు దేవునికి విరుద్ధమైన మాటలే బోధించాడు.



యేసుక్రీస్తు ప్రభువు ఆరాధానకు  పాత్రుడు

మత్తయి సువార్త 4:10లో ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభువారిని ఆరాధించాడు, ఆ సమయములో యేసు ప్రభువారు దానిని అంగీకరించారు. కాని యేసుక్రీస్తు ప్రభువు "దేవుడు ఒక్కడే కదా ఆరాధానకి పాత్రుడు!" అని అక్కడ ఒక వ్యాఖ్య చేశారు.

"సాతానా, పొమ్ము - నీ దేవుడైన ప్రభువుకు నమస్కరించి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను".  (మత్తయి సువార్త 4:10)

ఐనప్పటికీ యేసు ప్రభువారు అనేక మంది ప్రజలు తనకు కూడా మ్రొక్కడానికి అనుమతించారు. ఒక ఉదాహరణ చూద్దాము.

"అప్పుడొక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి - ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను."(మత్తయి 8:2)

యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించాలని బైబిల్ మనకు ఆజ్ఞ ఇస్తుంది.

"తండ్రిని ఘనపరుచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు." (యోహాను సువార్త 5:23)

"మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు." (హెబ్రీయులకు 1:6)

"అందుచేతను పరలోకముందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమిక్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను." (ఫిలిప్పీ 2:9-11)

ముహమ్మద్:- యేసుక్రీస్తు ప్రభువు ఆరాధనకు అనర్హుడు
ఖురాన్‍లో యేసుక్రీస్తు ప్రభువు ఆరాధనకు అర్హులు కారు అన్న భావన కనిపిస్తుంది.

"ఒకవేళ నిజంగానే కరుణామయునికి కుమారుడు ఉంటే, అతడి ఆరాధకులలో అందరికంటే మొదటివాడిని నేనే." (సురా 43:81)

వ్యాఖ్యానము:- దేవుడు మాత్రమే దైవత్వము కలవాడు కాబట్టి ఆయన మాత్రమే ఆరాధానకు పాత్రుడు. అనేక మంది మానవులు పరిపాలకులుగా ఉండిన కారణం వలన ఆరాధింపబడ్డారు, కానీ దేవుడు తనను మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞపించాడు. యేసు క్రీస్తు ప్రభువు కూడా ఈ మాటలే బోధించారు కాని వారి ఆరాధనను అంగీకరించారు. నిజానికి యేసుక్రీస్తు ప్రభువు ఎవరనే అవగాహాన మహమ్మద్‍కి కూడా లేదు. అందుచేత దేవుని కుమారుడిని ఆరాధించకూడదని నిషేధించాడు.


ప్రార్థన

యేసుక్రీస్తు ప్రభువు:- తన శిష్యులకు సామాన్యమైన రీతిలో హృదయపూర్వకంగా ప్రార్థించడం నేర్పించారు. దేవుడు హృదయ స్వరాన్ని వింటాడు, అంతేకాని బాహ్యరూపాన్ని చూడడు.

"నీవు ప్రార్థనచేయునప్పుడు నీ గదిలోకి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు; మీరు వారివలె ఉండకుడి." (మత్తయి సువార్త 6:5-13)

నిజమైన ప్రార్థన అంటే, పరలోకపు తండ్రితో కలిగియున్న సంబంధంవలన హృదయపూర్వకంగా మన లోపలినుండి కలిగే సహవాసభావన అని యేసు ప్రభువారు తెలియచేశారు.
    
ముహమ్మద్:- మాత్రం ఆచార సంబంధమైన నిర్జీవ ప్రార్థనా పద్దతిని నేర్పించాడు. (ఈ వ్యాక్యాలు హదీస్ బుఖారీ సహీహ్, 1వ పుస్తకం నుండి తీయబడ్డాయి)

488 - నమాజ్ చేసే ఒక వ్యక్తి ముందు నుండి ఎవరైనా వెళితే వారి నమాజ్ వ్యర్థమైపోతుంది.
489 - ఎవరైనా ప్రార్థన చేసే సమయంలో, వారి ముందు నడిచి వెళితే అది ఒక పాపం.
660 - ఇమాం ప్రార్థన చేసి లేవక ముందే ఇతరులు ప్రార్థన నుండి లేవకూడదు.(ఇమాం అనగా ఆచారసంబంధమైన ప్రార్థనను నడిపించే ముస్లిం మత గురువు). అలా కనుక మీరు అతనికంటే ముందే తల పైకెత్తి లేచారంటే, దేవుడు మీ ముఖమును గాడిద ముఖముగా మారుస్తాడు. (నిజానికలాగ ఎవరికీ ఇంతవరకు జరుగలేదు, అది కూడా ఒక అబద్ధమే).
685 - మీరు ప్రార్థనలో నిలబడ్డప్పుడు మీ వరుసలు కనుక వరుసగా, క్రమంగా లేకపొతే దేవుడు మీ ముఖములను వికారంగా చేస్తాడు. (నిజానికలాగ ఎవరికీ ఇంతవరకు జరుగలేదు, అది కూడా ఒక అబద్ధమే).
690 - ఒకవేళ మీరు ప్రార్థనలో నిలబడ్డప్పుడు మీ వరుసలు కనుక నేరుగా, క్రమంగా లేకపోతే, మీ ప్రార్థన మంచి ప్రార్థన కాదు.
717 - ఒకవేళ  మీరు ప్రార్థన సమయంలో మీ తలెత్తి పైకి చూశారంటే మీరు గుడ్డి వారైపోతారు. (నిజానికలాగ ఎవరికీ ఇంతవరకు జరుగలేదు, అది కూడా ఒక అబద్ధమే).
759 - ఒకవేళ  మీరు నమాజ్‍లో వంగే సమయంలో సరిగా వంగకపొతే, మీ ప్రార్థనలు అంగికరించబడవు.

ఈ ఇద్దరు వ్యక్తులు కూడా చాలా భిన్నమైన వ్యక్తులు. ఈ ఇద్దరు కూడా తమ ముద్రలను ఈ ప్రపంచంలో విడిచి వెళ్ళారు. క్రైస్తవులు క్రీస్తుని వెంబడిస్తున్నారు, మరి ముస్లింలు ముహమ్మదును వెంబడిస్తున్నారు. వీరిరువురు కూడా తాము దేవునుంచి వచ్చామనే చెప్పారు. కాని వారి ప్రవర్తన మరియు వారి భోదనలు చుస్తే ఎంతో వ్యత్యాసంగా  కనిపిస్తున్నాయి. కాబట్టి వీరిద్దరిలో నిజానికి ఒక్కరు మాత్రమే దేవుని నుండి పంపబడివారని గ్రహించగలుగుతాం.

అబద్ధ ప్రవక్తలు వస్తారని యేసు ప్రభువు ముందుగానే చెప్పారు. 

"అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు". (మత్తయి సువార్త  24:11)

నిజానికి ముహమ్మదు ఆ అబద్ధ ప్రవక్తల కోవకు చెందినవాడయ్యే అవకాశం ఉందా? మీరే ఆలోచించండి.


BIBLIOGRAPHY

[1]        The New International Study Bible, pub. by Zondervan Publishing House, Grand Rapids, Michigan, USA.
[2]        The Quran, translated by N.J. Dawood, pub. by Penguin Books, London, England.
[3]        "Sahih Al-Bukhari" - "The Translation of the Meanings of Sahih Al-Bukhari", translated by Dr. M Khan, pub. by Kitab Bhavan, New Delhi, India.
[4]        "Sahih Muslim", translated into English by A. Siddiqi, pub. by International Islamic Publishing House, Riyadh, Saudi Arabia.
[5]        "Sirat Rasulallah" - "The Life of the Prophet of God", translated as "The Life of Muhammad" by A. Guillaume, pub. by Oxford University Press, London, England.
[6]        "The History of Tabari", published by SUNY, Albany, New York, USA.
[7]        "Sunan of Abu Dawud", published by Al-Madina Publications, New Delhi, India.


ఆంగ్ల మూలం - A Comparison of Jesus and Muhammad


సైలాస్

ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు